‘‘అవన్నీ చెప్పకెహే! దాన్ని లేపేస్తావా లేదా?’’ గద్దించిందామె అతణ్ణి.తెల్లారి ముక్కలైన స్త్రీ దేహ భాగాలు దొరికాయి ఢిల్లీ పోలీసులకి!‘‘దీన్ని కూడా లేపేయాల్రోయ్!’’ గద్దించింది మళ్ళీ.మర్నాడు ముక్కలైన శవ భాగాలు మళ్ళీ దొరికాయి!వీడెవడో సీరియల్ కిల్లరని కంగారెక్కువైంది జనాల్లో. ఇద్దరు యువతులు గుర్తుపట్టలేనంతగా ముక్కలై దొరికారు.మొదటి పాలిథిన్ పార్శిల్ నాలాలో, రెండోది గుడి ముందు.
వరుస హత్యలతో ఢిల్లీ నగరం వణికింది. సీరియల్ కిల్లర్ వదంతులు పెరిగాయి. ‘‘ఒకే చోట రెండు హత్యలు చేయడం, సీరియల్ కిల్లర్ల పని కాదు. ఇద్దరి శరీర భాగాలు కొద్దిదూరంలోనే దొరికాయి. పీఎం రిపోర్ట్సు రానివ్వండి’’ సిబ్బందితో చెప్పాడు సౌత్ జాయింట్ కమిషనర్ ఉపాధ్యాయ్.పొత్తి కడుపు మీద, ఎడమ చేతి మీద మూడేసి నక్షత్రాల పచ్చబొట్లు పొడిపించుకుని వున్నట్టు మొదటి కేసు పీఎం రిపోర్టు. రెండో కేసులో గుర్తింపు ఆధారాల్లేవు. మొహం చెక్కేశారు. ఆయా ప్రాంతాల్లో దర్యాప్తు కూడా లాభించలేదు. మిస్సింగ్ కేసులు కూడా నమోదు కాలేదు- ఎవరీ యువతులు? పచ్చబొట్లని ఎవరు గుర్తిస్తారు? ఎవరా హంతకుడు?
పేపరు చదువుతూ ఒకచోట ఎలర్ట్ అయ్యాడు వసంత్. ఒక కాల్ చేశాడు. రెస్పాన్స్ లేదు. వేరే ఇంకో కాల్ చేశాడు. ఎవరూ ఎత్తలేదు. కంగారుగా జేసీ ఆఫీసుకెళ్లాడు. అతను చెప్పేది వింటూ, వెంటనే సోనమ్ కాల్ లిస్టు తీయించమన్నాడు జేసీ ఉపాధ్యాయ్. అరగంటలో సోనమ్ ఫ్లాట్‌కు చేరుకుని తాళం పగులగొట్టారు. ఈ ఫ్లాట్‌లో నయేషా కూడా ఉండేదన్నాడు వసంత్.‘‘అవును సర్, నక్షత్రం పచ్చ బొట్లు పొడిపించుకుంది నా మాజీ ప్రేయసి సోనమ్. తను, నయేషా అనే అమ్మాయితో ఈ ఫ్లాట్‌లో ఉండేది. ఇద్దరూ స్పాలో మసాజ్ గాళ్స్గా చేస్తారు...’’ వసంత్ చెబుతుంటే ఉపాధ్యాయ్ ఫ్లాటంతా సోదా చేశాడు. పనికొచ్చే సాక్ష్యాధారాలేవీ దొరకలేదు.‘‘ఐతే రెండో శవం నయేషాదేనా?’’ అనుమానంగా అడిగాడు. కావచ్చన్నాడు వసంత్. వార్త చదివిన వెంటనే ఆమెకి కూడా కాల్ చేస్తే, స్పందించ లేదన్నాడు.‘‘ఎవరు చంపారు, దేనికి చంపి ఉండవచ్చు, తెల్సా నీకూ?’’ ఉపాధ్యాయ్ ప్రశ్న.