‘‘ఏంటన్నావ్ పేరూ? అలాగా... ఈ సెల్‌ఫోన్ నీ దగ్గరెందుకుంది? అమర్ నీ ఫ్రెండా?... ఎక్కడున్నాడు? చెప్పు, పనుంది’’. అంటున్న ఇన్స్పెక్టర్ సుజిత్ రాయ్ మాటలకిఅవతల్నుంచి సమాధానం లేదు.కాల్ కట్ అయింది.
‘‘ట్రేస్ చేయండి వీణ్ణి. మోహన్ అట పేరు. అమర్ ఫ్రెండట... వాచ్ చెయ్యండి. సమ్‌థింగ్ మిస్టీరియస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ ఏరియా!’’ అని సిబ్బందిని ఎలర్ట్ చేశాడు. ‘‘సర్, షాపులో సెల్ఫోన్ల దొంగ వీడు కాదు సర్!’’ అని వచ్చి చెప్పారు సిబ్బంది.‘‘ఎవడట అసలు వీడు?’’‘‘మోహన్ సోనీ అని పాతికేళ్ళ కుర్రాడట. మీర్గంజ్లోనే ఉంటున్నాడు. చూస్తే దొంగలా లేడు. దొంగల దగ్గర కొన్నాడేమో ఫోను...’’ సిబ్బంది చూపిస్తున్న వీడియోలో మోహన్ వైపే చూస్తూ, ‘‘కన్ఫ్యూజ్ చెయ్యకండి. ఫ్రెండు షాపులో దొంగలు పడ్డారని వీడికి తెలీదా? తెలిసీ దొంగల దగ్గర సెల్ కొంటాడా?’’ అని సీరియస్ అయ్యాడు రాయ్.‘‘అంటే... వీడే దోపిడీ చేసీ...! కానీ ఎందుకు చేస్తాడు సర్ దోపిడీ?’’‘‘అదే కదా మిస్టరీ!’’‘‘ఐతే 24/7 సర్వైలెన్స్ సర్!’’‘‘అదే మిమ్మల్ని ఏడ్వమంటోంది!’’ ఒక యువతిని మోహన్ కలుస్తున్నట్టు కనిపెట్టారు నిఘా టీం.
మోడ్రన్‌గా, సినిమా హీరోయిన్‌కి తక్కువేం లేదు. ఆమె కూపీ లాగారు. గోపాల్‌గంజ్‌లో ఉంటోంది. మోహన్ ఉంటున్న మీర్గంజ్, ఈమె ఉంటున్న గోపాల్‌గంజ్ రెండూ పాట్నాకి 200 కి.మీల దూరంలో ఉన్నాయి. పేరు శకుంతల. పాతికేళ్ళు. తండ్రి లేడు, తల్లితో ఉంటోంది. ఫేస్బుక్లో ‘ముస్కాన్’ పేర చెలామణి అవుతోంది.‘‘సాలీ బహుత్ యారానా లగ్రీ రే!’’‘‘అరె చుప్, దాల్ మే బహుత్ కాలా హై...’’‘‘బహుత్ యారానా భీ హై!’’వాళ్ళిద్దరి కామకలాపాల్ని కైపెక్కిపోయి కెమెరాల కెక్కిస్తున్నారు నిఘా టీం.ఒక రోజు ఇన్స్పెక్టర్ రాయ్‌కి చెప్పారు, ‘‘సర్, మీర్గంజ్కి వస్తోంది శకుంతల... చూస్తారా?’’ వెంటనే వెళ్ళాడు. ఎడారి లాంటి మైదానంలో ఎటో నడుచుకుంటూ పోతున్నారు మోహన్, శకుంతల. మాటు వేసి చూడసాగాడు రాయ్ టీముతో. ఒక వంతెన కింద వాళ్ళు రాళ్ళల్లో వెతుకుతున్నారు. వెతికివెతికి తీశారు. ఎండకి తళతళ మెరుస్తోంది... రక్తమంటిన పొడవాటి వేట కత్తి! కెవ్వున కేకేసి అటూ ఇటూ పరుగెత్తడం మొదలెట్టారు నిఘా టీంని చూసి. ఇద్దర్నీ పట్టుకుని, కత్తి లాక్కుని, రాయ్ ముందు నించోబెట్టారు.