బాత్రూమ్లో భీమంటూ ఏదో కిందపడినట్టు చప్పుడైంది. అటు తిరిగి చూసింది ఆర్య. డోర్ హేండిల్ కదులుతున్నట్టన్పించింది.భర్త గౌరవ్ బయటికి వస్తున్నాడేమోనని అనుకుంది. గౌరవ్ ఎంతకీ బయటికి రాలేదు. లోపల ఎలాటి శబ్దాలూ లేవు. బాల్కనీలోకొచ్చి స్టూలేసుకుని నిలబడి, వెంటిలేటర్లోంచి తొంగిచూసింది. అంతే! గావుకేక వేసి తూలిపడిపోయింది...
అత్తమామలు పరుగెత్తుకొచ్చారు. పక్క ఫ్లాట్లో అతనూ వచ్చాడు. బాత్రూం తలుపు విరగ్గొట్టి చూస్తే కొనవూపిరితో గౌరవ్. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ హడావిడిలో గౌరవ్ గొంతు మీద నల్లని గీతను ఎవరూ గమనించలేదు...గొంతు మీద నల్లని గీత, పగబట్టిన ఆత్మ సంతకమని చెప్పేవాడు ఘోస్ట్ బస్టర్ గౌరవ్ తివారీ.ఫ ఫ ఫహాస్పిటల్లో గౌరవ్ మృతదేహాన్నే పరిశీలిస్తున్నాడు ఢిల్లీ ద్వారకాపురి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్. చికిత్స అందించే లోపే చనిపోయాడని చెప్పారు డాక్టర్లు. మరణ కారణం ఊపిరందక పోవడమన్నారు. గొంతు మీద నల్లని గీతని ఎవరూ పట్టించుకోలేదు, ఇన్స్పెక్టర్ సహా. పీఎం రిపోర్టులో దాని ప్రస్తావన వచ్చింది. కానీ ఆ గీత ఎలా ఏర్పడిందో చెప్పలేకపోయారు.బ్లాక్ లైన్ థియరీ గురించి గౌరవ్ చాలా సార్లు చెప్పేవాడని అతడి తండ్రి వివరించడంతో, ‘మేము దెయ్యాల్ని నమ్మం’ అనేశాడు ఇన్స్పెక్టర్ అశోక్సింగ్.
ఘోస్ట్ బస్టర్గా అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న గౌరవ్ తివారీ పారానార్మల్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించాడు. సొసైటీకి దేశవ్యాప్తంగా అనునిత్యం కాల్స్, మెయిల్స్ వెల్లువెత్తుతుంటాయి. 32 ఏళ్ల గౌరవ్ తన బృందంతో వెళ్లి ఆయా స్థలాల్లో ఆత్మల్ని పారదోలి వస్తూంటాడు. ఫుల్ స్పెక్ట్రమ్ కెమెరాల్లాంటి అత్యాధునిక పరికరాలను ఉపయోగించి ఆత్మల్ని కనిపెడతాడు. ఇళ్ళల్లో, శ్మశానాల్లో, ఖాళీగా ఉండిపోయిన చర్చిల్లో నిశాచరుడై తిరుగుతూంటాడు. విదేశాల్లో అనేక మందికి ఆత్మల బాధ వదిలించాడు. యూట్యూబ్లో అతను ఆత్మల్ని పట్టుకునే లైవ్ రికార్డింగ్స్ వుంటాయి. వారం వారం ఒక టీవీ షో కూడా నిర్వహిస్తున్నాడు..‘హత్యో ఆత్మహత్యో సర్, ఆత్మలూగీత్మలూ లేవు’ అని డీసీపీతో కూడా అన్నాడు ఇన్స్పెక్టర్ అశోక్సింగ్. ఎలా నిరూపిస్తారని అడిగాడు డీసీపీ.