లండన్ మహానగరంలో రాత్రి గడుస్తున్న కొద్దీ కేసినోలు ఊపందుకుంటున్నాయి. రెచ్చిపోయి ఆడుతూ ఎప్పటిలానే డబ్బంతా పోగొట్టుకుంటున్నాడు రాకేష్ భయానీ. ‘మ్యాడ్ గాంబ్లర్’గా పేరొందిన అతణ్ణి చూసి నవ్వుతున్నారంతా. అయినా లెక్కచెయ్యకుండా ఇంకా కాస్తూనే ఉన్నాడు.
ఇంతలో ఫోన్ వచ్చింది......‘‘మీ ఇంట్లో చెప్పనా?’’ అని!‘‘చంపేస్తా!’’ అంటూ లేచి ఉరికాడు ఫ్లాట్‌కి.ఆమె డోర్ తీసి, ‘‘తీయ్!’’ అంది. మొనదేలిన కత్తి తీశాడు.‘‘డబ్బు తీయ్!’’ అంది సారా కోపంగా.ఆమె కంఠం మీద ఒక్కపోటు పొడిచాడు. కుప్పకూలిపోయింది. బెడ్ కిందికి శవాన్ని ఈడ్చి పారేసి, పరారయ్యాడు...మర్నాడు రాత్రి నిక్‌తో తిరిగొచ్చి, ‘‘హెల్ప్ చెయ్’’ అన్నాడు శవాన్ని చూపిస్తూ.‘‘ఓ గాడ్, ఇక్కడ నా వేలి ముద్రలుంటాయ్... చాలా సార్లు వచ్చాన్నేను, నన్నొదిలేయ్’’ అని నిక్ అంటున్నా విన్పించుకోకుండా, ‘‘ఇప్పుడీ ఖరీదైన ఫ్లాట్ మనిద్దరిదిరా బాబూ. సారా పేరు మీదున్న డిపాజిట్లు, అకౌంట్‌లో క్యాష్ కూడా లాగెయ్యబోతున్నాం. ఫ్లాట్ కూడా అమ్మేస్తాం. కాబట్టి ఈ మర్డర్ బయట పడకూడదు, హెల్ప్ చెయ్!’’ అని నచ్చజెప్పాడు రాకేష్. పెద్ద బ్యాగులో సారా శవాన్ని మడత పెట్టి తోసి, మెట్ల మీంచి లాక్కుంటూ కిందికెళ్ళారు. లేపి కారు డిక్కీలో వేశారు. స్టార్ట్ చేసుకుని బయల్దేరారు. అప్పుడు ఓ ఇద్దరు చాకులాంటి అమ్మాయిలు కావాలన్నాడు రాకేష్, కారు నడుపుతూ.
**********************
లిబియాలో ఒక ఆయిల్ కంపెనీలో క్లర్క్‌గా పని చేస్తూ, ఎస్కార్ట్ గానూ సంపాదించిన డబ్బుతో వచ్చి లండన్లో స్థిరపడింది సారా. ఖరీదైన ఫ్లాట్ కొనుక్కుని, ఇప్పుడు ఎస్కార్ట్‌గా డబ్బు కోసం కాకుండా, సెక్స్‌ని ఎంజాయ్ చేసే దృష్టితో విశృంఖలంగా జీవిస్తోంది. ఓ పార్టీలో తనకి రాకేష్ పరిచయమయ్యాడు. రాకేష్‌కి భార్యా, ఇరవై ఏళ్ల కూతురు ఉన్నారు. చిన్నతనం నుంచే జూదం మరిగి డబ్బు తగిలేయడం మొదలెట్టాడతను. మ్యాడ్ గాంబ్లర్‌గా పేరు తెచ్చుకుని, డబ్బుకోసం మోసాలు ప్రారంభించాడు. తల్లిదండ్రుల ఇల్లు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళని ఇబ్బందుల్లో నెట్టేశాడు. వివిధ కోర్టుల్లో ఇరవైకి పైగా ఛీటింగ్ కేసులున్నాయి.