మానవ ‘ప్రయాణం’లో వసుధైక కుటుంబ సారూప్యత
ఎవరికైనా చరిత్ర తెలిసినప్పుడే భవిష్యత్తులో ఎలా ఉండాలో తెలుస్తుంది. వర్తమానంలో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. బతకడంకోసం బిటెక్ చదివేరోజులివి. కానీ భూమ్మీద పుట్టినందుకు మానవచరిత్ర, మానవజీవనంలో ఉన్న సారూప్యతలు తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం. ఈ పుస్తకంలో ఆ ప్రయత్నమే చేశారు బాలి. తెలుగువారికి సుపరిచితుడైన ప్రముఖ కార్టూనిస్టు, వ్యంగ్య చిత్రకారుడు (మేడిశెట్టి శంకరరావు) బాలి. అంతకుమించి కథానవలారచయిత, అనువాదకుడు.
143 ఏళ్ళ క్రితం రష్యాదేశం ఉక్రెయిన్‌లో పుట్టిన యూదుమతస్తురాలు రాచెల్ కలోఫ్ తన మాతృభాష యిద్దిష్‌లో రాసుకున్న ఆత్మకథకు ఇంగ్లీషునుంచి తెలుగులోకి బాలి చేసిన స్వేచ్ఛానువాదమే ఈ ‘ప్రయాణం’. హిందూ సమాజం మొదలు పురాతన ప్రపంచంలోని మతాలవారి ఆలోచనలూ, తీరుతెన్నులూ ఒకేవిధంగా ఎలా ఉండేవో మనకు తెలుస్తుంది.
ప్రతి మతానికీ ప్రకృతే మూలాధారమంటారు బాలి. హిందూమతం లాంటి ప్రాచీనమతానికీ, యూదుమతానికీ మధ్య సారూప్యతలను బాలి గమనించారు. వేదాన్ని, ఇరానీయుల (పర్ష్యన్లు) ‘అవెస్తా’ను పోల్చిచూస్తే ఆర్యులకు పారశీకులకు, ఆర్యులకూ ‘స్లాపు’ (రష్యన్లు, ఉక్రెయిన్లు, బైలోరష్యన్లు, బుల్గారులు, యుగొస్లోపులు, చెకొస్లోపులు, పోలులు) లకు చాలా దగ్గరప్లోలికలున్నాయంటారు బాలి. ఆ విషయాలన్నీ ఈ పుస్తకంలో మనం చదువుకోవచ్చు. భారతీయ సాంస్కృతిక విజ్ఞాన చరిత్రకు సంబంధించిన వేల సంవత్సరాలనాటి వేదాలు వంటి అమూల్యమైన నిధిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే అని కూడా ఆయన అంటారు. దీంతోపాటు మరో దీనికి సంబంధించిన మరో 20 కథలు కూడా ఇందులో ఉన్నాయి. సామాజిక చరిత్రకు సంబంధించిన ఎంతో విలువైన పుస్తకం ఈ ‘ప్రయాణం’.
ప్రయాణం
బాలి
ధర 175 రూపాయలు
పేజీలు 200
ప్రతులకు నవోదయ బుక్‌హౌస్, ఆర్యసమాజ్ ఎదురుగా
కాచిగూడ క్రాస్‌రోడ్స్, హైదరాబాద్–27
మొబైల్ 9000 413 413