ఆరోగ్యకర హాస్యం
ప్రసిద్ధ కవీ, కథకుడూ బాల గంగాధర తిలక్ తమ్ముడు దేవరకొండ గంగాధర రామారావు కథల కదంబం ఇది. రచయితది సునిశితమైన, ఆరోగ్యవంతమైన హాస్య ధోరణి. కథావస్తువులను ఎన్నుకోవడంలో ఆయన మనిషిని ఉన్నతీకరించే ప్రయత్నమే చేశారు. ‘ఇదే న్యాయం’, ‘సమాజం లేదు’ కథల్లో అమాన వీయంగా వర్ధిల్లుతున్న వర్తమాన సమాజాన్ని స్కాన్ చేశారు. ‘చీర సాగర మథనం’, ‘... పీచే క్యాహై’, ‘టెలుగూస్’ కథల్లో చురకలంటించే హాస్యాన్ని పండించారు. ‘మళ్ళీ పెళ్ళి’ కథలో గమ్మత్తైన సందేశాన్ని అంద జేస్తూ ‘మనసులు మారాలి, మనుషులు మారాలి, మనువులు మారాలి’ అన్న సలహాలతో శిల్పించారు. చివర్లో చేర్చిన ‘దావా దండకం’ (పేరడీ), ‘దగాపడిన గిరీశం’(సాహిత్య విమర్శ) అదనపు ఆకర్షణలు.
- రామా చంద్రమౌళి
ఈ ఉదయం నాది (కథలు)
రచన: దేవరకొండ గంగాధర రామారావు
పేజీలు: 201, వెల: రూ. 150
ప్రతులకు: దేవరకొండ ఎస్.మూర్తి 21-4-10/1, జి.ఎఫ్-1 సత్యసాయి టవర్స్, తణుకువారి వీధి,తణుకు- 534211